జీవో నెంబర్ 49 రద్దు చేయాలి: ఆదివాసీల డిమాండ్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండల కేంద్రంలో ఈరోజు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జీవ వైవిధ్య పరిరక్షణ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన టైగర్ కన్జర్వేషన్ జోన్ జీవో నెంబర్ 49కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన జరిగింది. మోటార్‌వే పై జీవో పత్రాలను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేసిన ఆదివాసీలు, "మా అడవులు – మా జీవితం" అంటూ నినాదాలు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ హక్కుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. “జీవో 49తో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా ఆదివాసులపై మోయలేని భారం మోపుతున్నారు. ఇది అప్రజాస్వామిక చర్య” అని మండిపడ్డారు.
"ఈ జీవో రద్దయ్యేంతవరకూ పోరాటం ఆగదు" అని హెచ్చరించిన నేతలు, ప్రభుత్వం తక్షణం స్పందించి జీవో నెంబర్ 49ను రద్దు చేసి ఆదివాసులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ గౌరవ అధ్యక్షులు సిడం సక్కారం, కొడప పుల్లయ్య, నైతం సత్తయ్య, మడప శ్రీనిస్, గవుడే గంగారాం, అలాగే ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం నుండి మేకల శ్యామ్ రావు, ఎడ్ల మహేష్, మెడి సత్తిస్, పోల్క వెంకటేష్, సత్యవన్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment