సింగరేణి కార్మికుల సమస్యల సాధనకై హెచ్ఎంఎస్ పోరాటం
కొత్తగూడెం, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి హెచ్ఎంఎస్ యూనియన్ తమ పోరాటాన్ని మరింత ముమ్మరం చేసింది. ఈ మేరకు ఈరోజు కొత్తగూడెం ఏరియాలోని సత్తుపల్లి జేవిఆర్ఓసి వద్ద హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించబడింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, జేబీసీసీ సభ్యుడు రియాజ్ గారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కార్మిక సంఘాలు చేసిన వాగ్దానాలు కేవలం మాయ మాటలేగా మిగిలిపోయాయని విమర్శించారు. కార్మికుల్ని మోసం చేసి ఓట్లు దండుకున్న సంఘాలు కార్మికులకు లాభం చేకూర్చేలా ఏదీ చేయలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వేజ్ బోర్డు, స్టాండర్డ్ మీటింగ్స్ వంటి పలు కీలక అంశాలపై జరిగిన చర్చలను సభలో వివరించారు. కార్మికుల ప్రాధాన్యత, ఉద్యోగ భద్రత, కొత్త ఉద్యోగాల సృష్టి, కొత్త బావుల నిర్మాణం వంటి అంశాల్లో హెచ్ఎంఎస్ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక శక్తిని కాపాడే దిశగా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
అలాగే, భవిష్యత్తు తరాలకు కంపెనీని కాపాడేందుకు ప్రతి కార్మికుడు ఈ పోరాటంలో భాగస్వామి కావాలనే పిలుపునిచ్చారు.
ఈ గేట్ మీటింగ్‌లో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్, ఏరియా ఇన్‌చార్జ్ అజ్గర్ ఖాన్, మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జ్ సాంబశివరావు, కమిటీ మెంబర్ నసీం ఖాన్, ఇతర ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంతేకాక, సత్తుపల్లి డిస్పెన్సరీ సమస్యలపై సీఎంఓ అధికారిని కలిసి మెమోరాండం అందించగా, కిష్టారం ఓసి ప్రాజెక్ట్ లో అధికారులు సమస్యలు పరిష్కరించాలని కోరారు. జీకే ఓసి హెడ్ ఓవర్ మెన్ శ్రీనివాసును హెచ్ఎంఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, కార్మిక సంక్షేమంపై రాజీ పడకుండా పోరాడాలని విజ్ఞప్తి చేశారు.
Post a Comment