ప్రేమ వ్యవహారం విషాదాంతం: యువకుడు పురుగు మందు తాగి మృతి
ఖమ్మం: ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. కుటుంబ సభ్యుల బెదిరింపులకు భయపడి పురుగు మందు తాగిన యువకుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం రూరల్ మండలం పడమటి తండాలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. తుమోజు సరస్వతి అనే మహిళ తన కుమారుడు విఘ్నేష్ చారి (20) ఆత్మహత్య చేసుకుని మృతిచెందినట్లు బుధవారం ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విఘ్నేష్ ఖమ్మం పట్టణంలో వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఖమ్మానికి చెందిన ఓ ముస్లిం యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఇది తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పఠాన్ రఫీ, షకీలా దంపతులు జూలై 1న విఘ్నేష్‌ను కలిశారు. ప్రేమ వ్యవహారం నెపంతో నువ్వు చచ్చిపో... లేదంటే మేమే చంపుతామని బెదిరించి దాడికి పాల్పడ్డారు.
వారి బెదిరింపులకు భయపడిన విఘ్నేష్ జూలై 3న కలుపు మందు తాగి తన కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపాడు. వెంటనే అతన్ని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బుధవారం అతడు మృతిచెందాడు.
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఖమ్మం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Post a Comment