-->

కవిత ఫ్లెక్సీల తొలగింపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం

కవిత ఫ్లెక్సీల తొలగింపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం


నల్లగొండ, నవంబర్‌ 12: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారంపై రాష్ట్ర రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్‌ అయ్యారు. “జాగృతి ఫ్లెక్సీలు ఎవరు తొలగించమన్నారు? ఎందుకు తొలగించారు? ఎవరి ప్రచారం వాళ్లది.. మీకేం సంబంధం?” అంటూ మంత్రి అధికారులను నిలదీశారు. బుధవారం ఇందిరా భవన్‌లో మున్సిపల్ కమిషనర్‌, పోలీసు అధికారులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఒకరి రాజకీయాలను మరొకరు అడ్డుకోవడం సరికాదు. ఏవైనా రాజకీయ సమస్యలు ఉంటే రాజకీయంగా పరిష్కరించుకుంటాం. కానీ, ఫ్లెక్సీలు తొలగించడం మీ అధికారం కాదు” అంటూ గట్టిగా హెచ్చరించారు. “మీరు చేసిన తప్పు వల్ల ఇప్పుడు ఇతరులతో నేను మాటలు పడాల్సి వస్తోంది” అంటూ అసహనం వ్యక్తం చేశారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో జాగృతి కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, అదే రోజు మంత్రి కోమటిరెడ్డి పర్యటన ఉండటంతో మున్సిపల్ అధికారులు ఆ ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై ఆగ్రహించిన జాగృతి కార్యకర్తలు మంత్రి కాన్వాయిని అడ్డుకొని నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటనపై కవిత స్పందిస్తూ, “మా ఫ్లెక్సీలను మంత్రి అనుచరుల చేత తొలగించడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపినందుకే మాపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి” అని విమర్శించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793