నేడు వేములవాడ ఆలయంలో దర్శనాల నిలిపివేత
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 12 : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అధికారులు ముందస్తు ప్రకటన లేకుండా దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం ఆలయ ద్వారం ఎదుట పెద్ద సంఖ్యలో నిలబడి నిరీక్షించారు. అయితే, ఆలయ ప్రధాన గేటుకు అధికారులు తాళం వేసి, లోపలికి ప్రవేశం లేకుండా రేకులు ఏర్పాటు చేయడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. కొందరు ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు.
ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్న కారణంగా ఒక రోజు పాటు దర్శనాలు నిలిపివేశామని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రచార రథంలోని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా రాజన్న స్వామివారి దర్శనం కల్పించారు.
అయితే, చలిలో కుటుంబ సభ్యులతో ఎంతో దూరం నుంచి వచ్చి మొక్కు చెల్లించుకోదామనుకున్నామని, ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా దర్శనాలు నిలిపివేయడం అన్యాయమని భక్తులు మండిపడుతున్నారు.

Post a Comment