-->

కరెంట్‌ షాక్‌కు గురైన విద్యార్థి.. పరిస్థితి విషమం

కరెంట్‌ షాక్‌కు గురైన విద్యార్థి.. పరిస్థితి విషమం


వికారాబాద్‌: విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యమే ఓ చిన్నారి ప్రాణాలను ముప్పుకు గురి చేసిన ఘటన వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, వికారాబాద్‌ గంగారం ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న వంశీ అనే విద్యార్థి బుధవారం మధ్యాహ్నం సమయంలో స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో పాఠశాల ప్రహరీ గోడకు అంచున ఉన్న 33 కె.వి ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్లగానే విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు.

ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఎలాంటి ఫెన్సింగ్‌ లేకపోవడం, రక్షణ కంచెలు ఏర్పాటు చేయకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో వంశీ చేతులు, కాళ్లు కాలిపోవడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ముక్కు నుండి రక్తస్రావం కూడా కనిపించింది.

తక్షణమే స్పందించిన పాఠశాల సిబ్బంది, స్థానికులు వంశీని వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, చివరికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి పంపించారు.

విద్యార్థి పరిస్థితి గురించి సమాచారం అందుకున్న ఆర్డీవో వాసు చంద్ర స్వయంగా ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించారు. అవసరమైతే వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. అనంతరం ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆర్డీవో, ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్‌ లేకపోవడంపై విద్యుత్‌ అధికారులను తీవ్రంగా ప్రశ్నించారు.

వెంటనే ట్రాన్స్ఫార్మర్‌ చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్థానికులు విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ ఇలాంటి ఘటనలు మరల జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793