సింగరేణి ఏరియాలో సర్ఫేస్ ఖాళీలను నింపడంలో అలసత్వం: హెచ్‌ఎమ్‌ఎస్ మండిపాటు
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 12: కొత్తగూడెం ఏరియా మేనేజ్మెంట్ సర్ఫేస్ ఖాళీలను ఫిల్‌అప్ చేయడంలో తీవ్ర అలసత్వం చూపుతోందని హెచ్‌ఎమ్‌ఎస్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఎమ్‌ఎస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గడిపల్లి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, సత్తుపల్లి ప్రాంతంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న కొంతమంది కార్మికులపై అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.
డిప్యూటేషన్‌లో ఉన్న వారిలో కేవలం కొందరినే పివికే–5 మైన్‌కి పంపించే ఆలోచన మేనేజ్మెంట్‌లో ఉందన్న వార్తలు కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. “ఎల్‌హెచ్‌డీ నడపడానికి ఆథరైజేషన్ ఉన్నారనే పేరుతో కొంతమందిని లక్ష్యంగా చేసుకోవడం సమంజసం కాదు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలను హెచ్‌ఎమ్‌ఎస్ సహించదు. సంవత్సరాలుగా అక్కడే విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కొనసాగించే అవకాశం ఇవ్వాలి” అని హెచ్చరించారు.
సర్ఫేస్ కౌన్సిలింగ్‌లో పారదర్శకత లేకపోవడంపై కూడా ఆయన మండిపడ్డారు. “కౌన్సిలింగ్ నిర్వహణలో స్పష్టత లేకపోవడం వల్ల కార్మికుల్లో వ్యతిరేకత పెరిగింది. అధికారులు తమవంతు బాధ్యత వహించి వెంటనే ఫీల్‌అప్ ప్రక్రియ పూర్తి చేయాలి. సర్క్యులర్ జారీ చేసిన రోజే ఆఫీస్ ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంది” అని డిమాండ్ చేశారు.
డిప్యూటేషన్ల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో స్పందించిన హెచ్‌ఎమ్‌ఎస్ నాయకులు, “డిప్యూటేషన్ దందాకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. పైరవీలకు వత్తాసు పలుకుతూ డిప్యూటేషన్ల పరంపర కొనసాగించడం అన్యాయం. ఇకనైనా పర్మినెంట్ కౌన్సిలింగ్ ద్వారా సర్ఫేస్ పోస్టులను న్యాయంగా భర్తీ చేయాలి” అని మేనేజ్మెంట్‌ను కోరారు.
ఈ కార్యక్రమానికి ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు అధ్యక్షత వహించగా, బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ఆర్‌సిఎచ్‌పి పిట్ సెక్రటరీ పూర్ణచందర్, సీనియర్ నాయకులు సత్యనారాయణ, సత్తుపల్లి సమంత పిట్ సెక్రటరీ నరసింహారావు, పివికే–5 అసిస్టెంట్ పిట్ సెక్రటరీ నవీన్, కన్వీనర్ గౌస్, నాయకులు సాయి సందీప్, ఆర్గనైజింగ్ సెక్రటరీ హమీద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment