-->

అజ్ఞాన చీకటిలో విజ్ఞాన జ్యోతి – మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

 

అజ్ఞాన చీకటిలో విజ్ఞాన జ్యోతి – మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

రామగుండం: టెమ్రీస్ రామగుండం–బయాస్–1లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ విద్యా దినోత్సవం మరియు 137వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమాత్–ఇ–ఇస్లామీ హింద్ వైస్ ప్రెసిడెంట్, టెమ్రీస్ కౌన్సిలర్, హింద్ మజ్దూర్ సభ (HMS) జాతీయ కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమరయోధుడిగా మాత్రమే కాకుండా, విద్యకు జీవం పోసిన మహనీయుడుగా నిలిచారు. ఆయన ‘అజ్ఞాన చీకటిలో విజ్ఞాన జ్యోతి’ వెలిగించారు. ఆయన దృష్టిలో విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు, మానవతా విలువలతో కూడిన సమగ్ర అభివృద్ధి” అని అన్నారు.

మౌలానా ఆజాద్ పూర్తి పేరు అబుల్ కలాం గులాం మొహియుద్దీన్. ఆయన 1888 నవంబర్ 11న మక్కా, అరేబియాలో జన్మించారు. 1958 ఫిబ్రవరి 22న ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన భారత తొలి విద్యా మంత్రిగా 1947 ఆగస్టు 15న నియమితులయ్యారు. ఆయన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1992లో భారతరత్న పురస్కారం ప్రదానం చేసింది.

మౌలానా ఆజాద్ అల్-హిలాల్, అల్-బలాగ్, లిసాన్ అల్-సద్దిక్, అల్-మిస్బా వంటి పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు. ఆయన రచనలు తజ్కిరా, ఇస్లాంలో స్వేచ్ఛ భావన, హయాత్ సర్మాద్, ఖలీఫా సమస్య, ఉమ్ అల్-కితాబ్ వంటి పుస్తకాల రూపంలో వెలువడ్డాయి.

కార్యక్రమంలో టెమ్రీస్ కౌన్సిలర్ ఐషా సిద్దిఖా, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, కాంగ్రెస్ నాయకుడు ఆసిఫ్, మైనార్టీ నాయకుడు అబ్దుల్ సత్తార్, జమాత్–ఇ–ఇస్లామీ హింద్ గోదావరిఖని నాయకుడు ముస్తఫా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ వారికి బహుమతులు, మొమెంటోలు అందజేశారు. ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ దంపతులకు బొకేలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు.

ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, “తల్లిదండ్రులు, విద్యార్థులు, సిబ్బందికి ఎల్లప్పుడూ కౌన్సిలింగ్ అందిస్తూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న కౌన్సిలర్లకు కృతజ్ఞతలు” తెలిపారు.

విద్యా విలువలను ప్రతిబింబించే ఈ కార్యక్రమం అజ్ఞాన చీకటిలో విజ్ఞాన జ్యోతి వెలిగించిన మౌలానా ఆజాద్‌కి అంకితం అయింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793