-->

మంచిర్యాలలో వింత ఘటన.. చేపల కోసం ఎగబడ్డ జనాలు

 

తెలంగాణలో చేపల వర్షం?.. మంచిర్యాలలో వింత ఘటన.. చేపల కోసం ఎగబడ్డ జనాలు

తెలంగాణలో చేపల వర్షం?.. మంచిర్యాలలో వింత ఘటన.. చేపల కోసం ఎగబడ్డ జనాలు

మంచిర్యాల, జూలై 30: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గురువారం చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. వర్షం కురుస్తున్న సమయంలో పుప్పాల హనుమాన్ వీధిలో రోడ్లపై, ఇళ్ల ముందు చిన్న చేపలు కనిపించడంతో ఒక్కసారిగా అక్కడ ఆసక్తికర వాతావరణం నెలకొంది.

గత రెండు రోజులుగా చెన్నూరు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండగా, గురువారం ఉదయం వర్షం సమయంలో కాలనీలోని పలు ప్రాంతాల్లో చిన్న చేపలు కనిపించాయి. తొలుత వాటిని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురై చుట్టుపక్కల వారికి సమాచారం అందించడంతో క్షణాల్లో అక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. ఇలాంటి ఘటనను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని పలువురు తెలిపారు.

రోడ్లపై కనిపించిన చేపలను ఏరుకునేందుకు చిన్నారులు, మహిళలు, యువకులు పోటీ పడ్డారు. కొందరు గొడుగులు, మరికొందరు బకెట్లు, సంచులు తీసుకుని చేపలను సేకరించారు. దీంతో కొద్దిసేపటికే ఆ ప్రాంతం సందడిగా మారింది.

ఈ ఘటనను స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియోలు వేగంగా వైరల్ అవుతున్నాయి. "చెన్నూరులో చేపల వర్షం", "ఆకాశం నుంచి చేపలు పడ్డాయి" అనే శీర్షికలతో ఈ వీడియోలు విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

అయితే ఈ ఘటన వెనుక అసలు కారణంపై ఇప్పటికీ స్పష్టత లేదు. భారీ వర్షాలు, బలమైన గాలుల ప్రభావంతో సమీపంలోని చెరువులు లేదా కాలువల నుంచి చేపలు కొట్టుకువచ్చి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు వరద నీటి ప్రవాహంతో చేపలు రోడ్లపైకి చేరి ఉండొచ్చని చెబుతున్నారు. మరోవైపు కొందరు దీనిని "చేపల వర్షం"గా ప్రచారం చేస్తున్నారు.

అయితే చేపలు అక్కడికి ఎలా చేరాయన్న విషయంపై ఇప్పటివరకు అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో అధికారిక నిర్ధారణ వచ్చే వరకు ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణంపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

Blogger ఆధారితం.