-->

పిల్లి అడ్డురావడంతో ఆటో బోల్తా.. 10 మంది మహిళా కూలీలకు గాయాలు

 

పిల్లి అడ్డురావడంతో ఆటో బోల్తా.. 10 మంది మహిళా కూలీలకు గాయాలు

పిల్లి అడ్డురావడంతో ఆటో బోల్తా.. 10 మంది మహిళా కూలీలకు గాయాలు

ఖమ్మం జిల్లా: వేంసూరు మండలంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మహిళా కూలీలు గాయపడటంతో తీవ్ర కలకలం రేగింది. ఎర్రగుంటపాడు శివారులో కూలీలతో వెళ్తున్న ఆటోకు అకస్మాత్తుగా పిల్లి అడ్డు రావడంతో డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. వేంసూరు అంబేద్కర్‌నగర్‌కు చెందిన 10 మంది మహిళా కూలీలు రాయుడుపాలెం, కల్లూరుగూడెం శివారులోని మెట్ట పొలాల్లో మిరప నారు నాటేందుకు ఆటోలో బయలుదేరారు. ఎర్రగుంటపాడు శివారుకు చేరుకోగానే రోడ్డుపైకి ఒక్కసారిగా పిల్లి రావడంతో డ్రైవర్‌ అప్రమత్తమై బ్రేక్‌ వేశాడు. ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది మహిళా కూలీలకు గాయాలయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు మహిళలను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే పిల్లి అడ్డురావడం వల్లే ప్రమాదం జరిగిందనే విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పిల్లి ఎదురైతే కొంతసేపు ఆగి వెళ్లాలనే నమ్మకాలపై కూడా మరోసారి చర్చ జరుగుతోంది. అయితే ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వాహనం అదుపుతప్పడమేనని, మూఢనమ్మకాల కంటే రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.

Blogger ఆధారితం.