-->

పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం: కేసీఆర్

 

పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం: కేసీఆర్

పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం: కేసీఆర్

హైదరాబాద్, ఆగస్టు 8: దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు చెరో రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలు అందించనున్నట్లు వెల్లడించారు.

పిల్లల చదువు, భవిష్యత్తు, కుటుంబ సంక్షేమానికి సంబంధించి కూడా పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం తీసుకున్నట్లు తెలిపారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నాయకులు సమావేశమై ఆయన కుటుంబానికి భవిష్యత్తులో అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారని కేసీఆర్ పేర్కొన్నారు.

పెద్ది కుటుంబానికి ఎల్లప్పుడూ బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు, బీఆర్‌ఎస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది.

Blogger ఆధారితం.