-->

సొంత ప్రభుత్వంపైనే ‘రాములమ్మ’ ఫైర్.. ఉద్యమకారులను విస్మరిస్తే ఊరుకోను!

 

సొంత ప్రభుత్వంపైనే ‘రాములమ్మ’ ఫైర్.. ఉద్యమకారులను విస్మరిస్తే ఊరుకోను!

సొంత ప్రభుత్వంపైనే ‘రాములమ్మ’ ఫైర్.. ఉద్యమకారులను విస్మరిస్తే ఊరుకోను!

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి వేదికగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ విజయశాంతి తన సొంత ప్రభుత్వంపైనే తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యంపై ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యమకారుల త్యాగాలను విస్మరించడం సరికాదని స్పష్టం చేశారు.

బుధవారం శాసన మండలి సమావేశాల్లో జరిగిన చర్చ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి లాఠీ దెబ్బలు తిన్నారని, జైళ్లకు వెళ్లారని గుర్తుచేశారు.

“ఉద్యమకారులు పోరాడకపోతే ఈరోజు మీరు ముఖ్యమంత్రులు, మంత్రులుగా ఉండేవారా?” అంటూ ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ఉద్యమకారుల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వారి త్యాగాలను విస్మరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

అమరవీరుల కుటుంబాలకు హామీలు అమలు చేయాలి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన కీలక హామీల అమలులో జాప్యం జరుగుతోందని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు, ప్రభుత్వ పెన్షన్లు ఇస్తామని ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై కూడా ఆగ్రహం

ఉద్యమకారుల సమస్యలతో పాటు రాష్ట్రంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపైనా విజయశాంతి స్పందించారు. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆరోగ్య రంగంలో ప్రభుత్వం ‘క్వాలిటీ’ పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. వైద్య ఖర్చులు భరించలేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.

సొంత పార్టీ ప్రభుత్వంపైనే విజయశాంతి బహిరంగంగా చేసిన ఈ వ్యాఖ్యలు శాసన మండలిలో చర్చనీయాంశంగా మారాయి. ఉద్యమకారుల హామీల అమలు, ప్రజారోగ్యంపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలన్న ఆమె డిమాండ్లు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Blogger ఆధారితం.