డిపెండెంట్ ఉద్యోగాలు దానం కాదు.. సింగరేణి కార్మికుల హక్కు: కల్వకుంట్ల కవిత
డిపెండెంట్ ఉద్యోగాలు దానం కాదు.. సింగరేణి కార్మికుల హక్కు: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: సింగరేణి కార్మికుల వారసులకు ఇచ్చే డిపెండెంట్ ఉద్యోగాలు ప్రభుత్వాలు చేస్తున్న దానం, ధర్మం కాదని, అవి సింగరేణి కార్మికుల హక్కు అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆమె ఆరోపించారు.
సింగరేణిలో మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులకు సకాలంలో మెడికల్ బోర్డులు నిర్వహించకుండా కాలయాపన చేశారని కవిత విమర్శించారు. హెచ్ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ‘సింగరేణి బాయిబాట’ కార్యక్రమం నిర్వహించి, మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోతే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించిన తర్వాతే బోర్డులు నిర్వహిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
నామమాత్రంగా మెడికల్ బోర్డు నిర్వహిస్తే ఊరుకోం
గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న మెడికల్ బోర్డుల్లో కేవలం 12.5 శాతం మంది కార్మికులను మాత్రమే అన్‌ఫిట్‌గా ప్రకటిస్తున్నారని కవిత ఆరోపించారు. మిగిలిన వారిని ‘డ్యూటీ ఫిట్’గా పేర్కొంటూ తిరిగి విధుల్లోకి పంపుతున్నారని, వారిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులు కూడా ఉన్నారని అన్నారు.
బొగ్గు గనుల్లో పనిచేస్తూ తమ చెమట, రక్తాన్ని ధారపోసి తెలంగాణకు వెలుగులు అందిస్తున్న కార్మికుల ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. సింగరేణిలో బొగ్గు తవ్వకాల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
కార్మికుల త్యాగాలను గుర్తించి వారి వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించే విధానం తీసుకొచ్చారని, అది ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల వల్ల వచ్చిన పథకం కాదని కవిత అన్నారు.
మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న సింగరేణి కార్మికులందరినీ అన్‌ఫిట్‌గా ప్రకటించి, వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
సింగరేణి బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
సింగరేణి బొగ్గు నాణ్యతపై ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని కవిత ఆరోపించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు జీ-9 బొగ్గు, ఇతర థర్మల్ పవర్ ప్లాంట్లకు జీ-11 బొగ్గు అవసరమని, సింగరేణిలో ఆ నాణ్యత బొగ్గు అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నామని సీఎం చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు.
అయితే సింగరేణిలో జీ-3 నుంచి జీ-8 వరకు మెరుగైన గ్రేడ్ బొగ్గు కూడా అందుబాటులో ఉందని కవిత అన్నారు. సింగరేణిలో ఉన్న బొగ్గును సద్వినియోగం చేసుకునే సామర్థ్యం ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
జేవీఆర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, మణుగూరు ఓసీ-2 ఎక్స్టెన్షన్, కేసీహెచ్పీ, కేసీహెచ్పీ లైన్-1, రామగుండం 11 ఇంక్లైన్, భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ ఓసీపీ-2, ఓసీపీ-3, మందమర్రి ఏరియాలోని కాసిపేట-2, ఆర్కేపీ సీహెచ్‌పీ, శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-6తో పాటు ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌లోనూ జీ-9 బొగ్గు అందుబాటులో ఉందని ఆమె వివరించారు.
రూ.54 వేల కోట్ల బకాయిలపై ప్రశ్న
సింగరేణికి ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.54 వేల కోట్ల బకాయిలను ఎగ్గొట్టేందుకే బొగ్గు నాణ్యతపై ప్రభుత్వం ప్రశ్నలు లేవనెత్తుతోందని కవిత ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడం ద్వారా ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చే కుట్ర జరుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతో కొన్ని కార్పొరేట్ సంస్థలు కలిసి సింగరేణిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయని కవిత ఆరోపించారు. ముఖ్యంగా సింగరేణిలో శాశ్వత ఉద్యోగాలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు.
ఇతర రాష్ట్రాలకు బొగ్గు అమ్ముతున్నారని ఆరోపణ
సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న జీ-9 బొగ్గును కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు అధిక ధరలకు విక్రయిస్తున్న ప్రభుత్వం, తెలంగాణలోని పవర్ ప్లాంట్లకు మాత్రం అదే బొగ్గును సరఫరా చేయడం లేదని కవిత ఆరోపించారు.
సింగరేణిపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తెలంగాణ రక్షణ సేన ప్రజలకు వివరిస్తుందని ఆమె తెలిపారు. సంస్థను, కార్మికుల హక్కులను దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

Post a Comment