-->

చనిపోయాడనుకున్న వ్యక్తి బతికొచ్చాడు!అంత్యక్రియలకు తరలిస్తుండగా లేచి కూర్చున్న వృద్ధుడు

 

చనిపోయాడనుకున్న వ్యక్తి బతికొచ్చాడు!అంత్యక్రియలకు తరలిస్తుండగా లేచి కూర్చున్న వృద్ధుడు

చనిపోయాడనుకున్న వ్యక్తి బతికొచ్చాడు!

కరీంనగర్‌ ఆస్పత్రిలో మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారణ.. అంత్యక్రియలకు తరలిస్తుండగా లేచి కూర్చున్న వృద్ధుడు

చందుర్తి, సెప్టెంబర్‌ 27: చనిపోయాడని వైద్యులు నిర్ధారించిన ఓ వృద్ధుడు అంత్యక్రియల కోసం స్వగ్రామానికి తరలిస్తుండగా అకస్మాత్తుగా లేచి కూర్చున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సనుగుల గ్రామానికి చెందిన చీకటి శంకరయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం శంకరయ్య మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తున్నారు.

అయితే జోగాపూర్‌ సమీపంలో అంబులెన్స్‌లో శంకరయ్య అకస్మాత్తుగా లేచి కూర్చున్నారు. దీంతో షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌ను వేములవాడ వైపు మళ్లించారు. శంకరయ్యను అక్కడి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి వైద్యులతో పరీక్షలు చేయించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, తండ్రి మృతి చెందారన్న సమాచారంతో ఆయన కుమారులు గల్ఫ్‌ నుంచి స్వగ్రామానికి బయల్దేరినట్లు తెలిసింది. శంకరయ్య బతికే ఉన్నారన్న విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు ఊరట చెందారు. ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈ విషయం గ్రామంలో తెలియడంతో శంకరయ్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు తరలివచ్చారు. చనిపోయాడని భావించిన వ్యక్తి అంత్యక్రియలకు తరలిస్తుండగా తిరిగి లేచి కూర్చోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Blogger ఆధారితం.