అక్రమ అండాల సేకరణ ముఠా గుట్టురట్టు.. 18 మంది యువతులు అదుపులోకి!
సరూర్‌నగర్‌లో అక్రమ అండాల సేకరణ ముఠా గుట్టురట్టు.. 18 మంది యువతులు అదుపులోకి!
కాలేజీ విద్యార్థినులే లక్ష్యంగా అక్రమ దందా.. ఇంజెక్షన్ల ద్వారా అండాల సేకరణ
హైదరాబాద్‌లో అక్రమ అండాల సేకరణ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. బేగంపేట ఘటన మరువకముందే తాజాగా సరూర్‌నగర్‌లో మరో అక్రమ అండాల సేకరణ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని ఓ నివాసంలో కాలేజీ విద్యార్థినులు, నిరుపేద యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. విశ్వసనీయ సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు సదరు నివాసంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న 18 మంది యువతులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కాలేజీ విద్యార్థినులు, పేద యువతులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆశ చూపి ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైనట్లు సమాచారం.
యువతులకు ఇంజెక్షన్లు ఇచ్చి వారి నుంచి అండాలను సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇలా సేకరించిన అండాలను నగరంలోని కొన్ని ప్రముఖ ఐవీఎఫ్ (IVF) కేంద్రాలకు అనధికారికంగా సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు సమాచారం.
ఈ అక్రమ దందా వెనుక ప్రధాన సూత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అండాల సేకరణ, సరఫరాలో ఎవరెవరి ప్రమేయం ఉంది? ఏయే ఐవీఎఫ్ కేంద్రాలకు వీటిని పంపిస్తున్నారు? అనే అంశాలపై సమగ్ర విచారణ చేపడుతున్నారు.
బేగంపేట, ప్రకాష్‌నగర్ ఘటనలతో ఆందోళన
హైదరాబాద్‌లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు వరుసగా వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల బేగంపేట, ప్రకాష్‌నగర్ ప్రాంతాల్లోని గర్ల్స్ హాస్టళ్లపై కూడా పోలీసులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాలైన బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా నుంచి యువతులను నగరానికి తీసుకొచ్చి, వారి నుంచి అక్రమంగా అండాలను సేకరిస్తున్న ముఠాల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి.
ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని యువతులను ఈ తరహా కార్యకలాపాల్లోకి దింపుతున్నారనే ఆరోపణలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో అక్రమ అండాల సేకరణ, సరఫరా వ్యవస్థపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
యువతుల ఆరోగ్య భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, వీటి వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థల పాత్రను వెలికితీయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Post a Comment