పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వివిధ పోటీలు
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వివిధ పోటీలు
అక్టోబర్ 22లోపు ఎంట్రీలు అందజేయాలి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Police Flag Day) కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు, యువత, పోలీసు సిబ్బందిలో దేశభక్తి, సామాజిక బాధ్యత, పోలీసుల సేవల పట్ల అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు.
ఈ సందర్భంగా వ్యాసరచన, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, ప్రజల రక్షణ కోసం పోలీసులు అందిస్తున్న సేవలను గుర్తించడం, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రను ప్రజలకు తెలియజేయడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
విద్యార్థులు, యువతతో పాటు ఆసక్తి గల పోలీసు సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఎస్పీ సూచించారు. వ్యాసరచన ద్వారా తమ ఆలోచనలను అక్షరరూపంలో వ్యక్తపరచవచ్చని, ఫోటోగ్రఫీ ద్వారా పోలీసుల సేవలు, త్యాగాలు, సామాజిక అంశాలను చిత్రాల్లో ఆవిష్కరించవచ్చని తెలిపారు. అలాగే షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా పోలీసుల విధులు, ప్రజా భద్రత, సమాజంలో శాంతిభద్రతల ప్రాముఖ్యత వంటి అంశాలను సృజనాత్మకంగా ప్రజలకు వివరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అక్టోబర్ 22లోపు ఎంట్రీలు అందజేయాలి
ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు తమ ఎంట్రీలను అక్టోబర్ 22వ తేదీలోపు జిల్లా పోలీసు కార్యాలయం (DPO)లోని పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO)కు అందజేయాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు.
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఎక్కువ మంది పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలిచేలా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

Post a Comment