బార్‌లో రివాల్వర్‌తో హల్‌చల్‌.. డబ్బులు తిరిగివ్వకపోతే కాల్చేస్తా

 

సోమాజిగూడ బార్‌లో రివాల్వర్‌తో హల్‌చల్‌.. డబ్బులు తిరిగివ్వకపోతే కాల్చేస్తానంటూ బెదిరింపులు

సోమాజిగూడ బార్‌లో రివాల్వర్‌తో హల్‌చల్‌.. డబ్బులు తిరిగివ్వకపోతే కాల్చేస్తానంటూ బెదిరింపులు!

బౌన్సర్లు, కస్టమర్లను తుపాకీతో బెదిరించిన వ్యక్తి అరెస్ట్‌

హైదరాబాద్‌: సోమాజిగూడలోని ఓ ప్రముఖ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో రివాల్వర్‌తో ఓ వ్యక్తి హల్‌చల్‌ చేయడం కలకలం రేపింది. బిల్లు కోసం చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వకపోతే కాల్చి చంపుతానంటూ బార్‌ సిబ్బంది, బౌన్సర్లు, కస్టమర్లను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో సోమాజిగూడలోని హెడ్‌క్వార్టర్స్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ రెండో అంతస్తులో కొందరు కస్టమర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన బార్‌ సిబ్బంది జోక్యం చేసుకుని ఇరువర్గాలను బయటకు పంపించారు.

అనంతరం వారిలో ఒకరైన మహమ్మద్‌ షానవాజ్‌ సెల్లార్‌లో పార్క్‌ చేసి ఉన్న తన మహీంద్రా థార్‌ వాహనం వద్దకు వెళ్లి, అందులో ఉన్న రివాల్వర్‌ను తీసుకుని తిరిగి రెస్టారెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అయితే గ్రౌండ్‌ ఫ్లోర్‌లో విధులు నిర్వహిస్తున్న బౌన్సర్‌ గణేశ్‌ అతడిని అడ్డుకుని సెల్లార్‌ వైపు తీసుకెళ్లాడు.

అయినప్పటికీ, ఇతర కస్టమర్ల వెంట మళ్లీ సెల్లార్‌లోకి వెళ్లిన షానవాజ్‌ చేతిలోని రివాల్వర్‌ను చూపిస్తూ అక్కడున్న సిబ్బంది, కస్టమర్లను బెదిరించినట్లు సమాచారం. బిల్లు కోసం చెల్లించిన డబ్బులను వెంటనే తిరిగి ఇవ్వకపోతే కాల్చి చంపుతానని హెచ్చరించడంతో అక్కడి వారు భయాందోళనలకు గురయ్యారు.

నిందితుడి అరెస్ట్‌.. రివాల్వర్‌ స్వాధీనం

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బార్‌ వద్దకు చేరుకుని మహమ్మద్‌ షానవాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న రివాల్వర్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు మహీంద్రా థార్‌ వాహనాన్ని కూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

బార్‌ బౌన్సర్‌ బచ్చు బంటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్న పోలీసులు, చట్టప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నారు.

Blogger ఆధారితం.