రాప్తాడులో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి

 

గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశం

 రాప్తాడులో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి 

 గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశం

అనంతపురం జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడులో అమానుష ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై యువకుడు చెట్లు నరికే రంపంతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. ఆమె ముఖం, వీపు సహా శరీరంలోని పలు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక చేయి తెగిపోయినట్లు కూడా సమాచారం అందుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

 సీసీటీవీ ఆధారంగా నిందితుడి అరెస్ట్

విద్యార్థినిపై దాడి చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడి ఆచూకీ గుర్తించారు. ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిని నాగులూరుకు చెందిన హేమంత్‌గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. సుమారు పదేళ్ల క్రితం అతడు అయ్యవారిపల్లెకు వచ్చినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మరణించడంతో తన అక్క వద్ద ఉంటున్నట్లు సమాచారం.

ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్పందన

విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధిత విద్యార్థిని తల్లితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాలికకు మెరుగైన వైద్యం అందించేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

విద్యార్థినులపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత బాధాకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు. బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అవసరమైన మెరుగైన వైద్య చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. విద్యార్థినిపై దాడికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని స్థానికులు కోరుతున్నారు.


Blogger ఆధారితం.