మద్ది కల్వర్టుపై నుంచి కొట్టుకుపోయిన ఆయిల్ డబ్బాల లారీ.. చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్
మద్ది కల్వర్టుపై నుంచి కొట్టుకుపోయిన ఆయిల్ డబ్బాల లారీ.. చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్
కాకినాడ నుంచి ఆయిల్ డబ్బాల లోడుతో విజయనగరం వెళ్తున్న ఓ లారీ బుధవారం తెల్లవారుజామున వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. మద్ది కల్వర్టుపై నుంచి లారీ ప్రయాణిస్తుండగా, ఇసుకగెడ్డ ప్రవాహ ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
లారీ డ్రైవర్ జనపరెడ్డి సూర్యప్రకాశ్ ప్రవాహ తీవ్రతను అంచనా వేయలేకపోవడంతో లారీ వరద నీటిలో కొట్టుకుపోయింది. కొంతదూరం ప్రవాహంలో వెళ్లిన లారీ చివరకు చెట్ల మధ్య ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి బయటకు వచ్చి సమీపంలోని చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు.
అయితే లారీ చిక్కుకున్న ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో ఈ ఘటనను తొలుత ఎవరూ గుర్తించలేదు. అనంతరం గెడ్డ ప్రవాహం తగ్గడంతో డ్రైవర్ సురక్షితంగా ఒడ్డుకు చేరుకుని స్థానికులకు సమాచారం అందించాడు. దీంతో లారీ వరదలో కొట్టుకుపోయిన విషయం వెలుగులోకి వచ్చింది.
అధికారుల హెచ్చరికల తర్వాతే ప్రమాదం!
ఇసుకగెడ్డ ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో కల్వర్టుపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు పోలీసు, రెవెన్యూ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయినప్పటికీ ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. వరద ప్రవాహం ఉన్న కల్వర్టులు, వాగులు దాటేందుకు వాహనదారులు ప్రయత్నించవద్దని అధికారులు సూచిస్తున్నారు.

Post a Comment