రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మండల వ్యవసాయ అధికారి

 

రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మండల వ్యవసాయ అధికారి

రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మండల వ్యవసాయ అధికారి

సదాశివపేట, నవంబర్ 3: సంగారెడ్డి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి అధికారిని పట్టుకున్నారు. సదాశివపేట మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న జి. రమేష్ రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి అల్లుడు నిర్వహిస్తున్న ఎరువుల వ్యాపారం ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగేందుకు సహకరించాలంటే మొత్తం రూ.30 వేల లంచం ఇవ్వాలని మండల వ్యవసాయ అధికారి రమేష్ డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా గత అక్టోబర్ 19న ఇప్పటికే రూ.10 వేలు తీసుకున్నారు. మిగిలిన రూ.20 వేల కోసం ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఈ క్రమంలో నవంబర్ 3న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సదాశివపేట మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఫిర్యాదుదారుడి నుంచి మరో రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న రూ.20 వేల నగదును అధికారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ అధికారి తన అధికారిక విధులను నిజాయితీగా నిర్వహించకుండా, అక్రమంగా లబ్ధి పొందేందుకు లంచం స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల విచారణకు సంబంధించిన గౌరవనీయులైన రెండో అదనపు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తెలిపారు.

ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని, ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.

లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

అలాగే వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్‌బుక్‌లో Telangana ACB, ఎక్స్‌ (ట్విట్టర్)లో @Telangana ACB ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన బాధితుల పేర్లు, వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.


Blogger ఆధారితం.