పాతబస్తీలో దారుణ హత్య.. యువకుడు స్పాట్ డెడ్, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
పాతబస్తీలో దారుణ హత్య.. యువకుడు స్పాట్ డెడ్, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
హైదరాబాద్, నవంబర్ 03: హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబానగర్‌లో మంగళవారం తెల్లవారుజామున ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. సయ్యద్ ఒమర్ అలియాస్ మషల్లా ఒమర్‌పై కొందరు వ్యక్తులు ఒక్కసారిగా కత్తులతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఒమర్ పక్కనే ఉన్న సయ్యద్ అనే వ్యక్తి దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో దుండగులు అతడిపై కూడా కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఒమర్ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందగా, సయ్యద్ తీవ్ర గాయాలపాలయ్యాడు.
దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన సయ్యద్‌ను సమీప ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఒమర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు
ఈ హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు ఘటన జరిగిన ప్రాంతంతో పాటు పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. హత్యకు గల కారణాలు, దాడిలో పాల్గొన్న వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు.
మృతుడిపై గతంలోనూ ఆరోపణలు?
మృతుడు ఒమర్‌కు గతంలో నేర చరిత్ర ఉందని స్థానికులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అమన్ ఖురేషి, అలీ భైసా అనే వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒమర్‌పై గతంలో బెదిరింపులు, బలవంతపు నగదు వసూళ్లకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని వారు పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది.
అయితే హత్యకు అసలు కారణాలు ఏమిటి? స్థానికులు ఆరోపిస్తున్న వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడ్డారా? అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనతో హఫీజ్ బాబానగర్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.

Post a Comment