మహబూబ్నగర్ జిల్లాలో దారుణం.. మహిళ తల, మొండెం వేరు చేసి హత్య!
మహబూబ్నగర్ జిల్లాలో దారుణం.. మహిళ తల, మొండెం వేరు చేసి హత్య!
భూ వివాదమే హత్యకు కారణమా? నలుగురు నిందితులు పోలీసుల అదుపులో
మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం చింతల్ తండాలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. ఓ మహిళను అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. చింతల్ తండాకు చెందిన కాట్రావత్ బలరాంకు, ఓబ్లాయిపల్లి తండాకు చెందిన కాట్రావత్ సునీతతో సుమారు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రిషిక, శైలజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే బలరాంకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఏడాది క్రితం బలరాం ఇద్దరు అన్నలు మాన్యనాయక్, పాండునాయక్ అతడిని హైదరాబాద్కు తీసుకెళ్లారు. కుటుంబ పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీ తీర్పు మేరకు బలరాంకు చెందిన ఎకరంన్నర వ్యవసాయ భూమిని సునీత పేరుపై కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటి నుంచి భర్త హైదరాబాద్లో ఉండగా, సునీత తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పుట్టింట్లో నివసిస్తోంది.
పొలం వద్దకు వెళ్తుండగా అడ్డగించి..
ఇటీవల సునీత తిరిగి చింతల్ తండాకు వచ్చి తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా మాన్యనాయక్ ఆమెను అడ్డగించి తమ ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ అప్పటికే ఉన్న మరో సోదరుడు పాండునాయక్, అతని భార్య పార్వతి, మాణిక్యనాయక్ అనే మరో వ్యక్తి కలిసి సునీతపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ దాడిలో నిందితులు సునీతను గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపినట్లు సమాచారం. తల, మొండెం వేరయ్యేంత క్రూరంగా హత్య చేసి అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
నలుగురు నిందితులు అదుపులోకి..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కుటుంబ కలహాలు, భూమి వివాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇద్దరు చిన్నారులకు తల్లి దూరం కావడంతో చింతల్ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Post a Comment