ఫిబ్రవరిలోనే సెగలు పుట్టిస్తున్న ఎండలు పలుచోట్ల 35 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో భానుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఫిబ్రవరి మూడో వారానికే ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా మార్చి చివరి నుంచి పెరగాల్సిన ఉష్ణోగ్రతలు ఈసారి ముందుగానే పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 35 డిగ్రీల సెల్సియస్‌ను దాటేశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం నుంచి ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించారు.
ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా, జగిత్యాల జిల్లా, ఖమ్మం జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకపోతే బయటకు వెళ్లకూడదని, తగినంత నీరు తాగాలని, వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రైతులు కూడా పొలాల్లో పని చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
ఇక రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Post a Comment