-->

కల్లాకల్ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు రెండు వేలు జరిమానా

 

కల్లాకల్ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు రెండు వేలు జరిమానా

కల్లాకల్ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు రెండు వేలు జరిమానా 

భార్యతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో సహచర కూలీని హత్య చేసిన నిందితుడు

రూ.2,000 జరిమానా విధిస్తూ ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పు

మెదక్, ఆగస్టు 12: మనోహరాబాద్ మండలం కల్లాకల్ గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. భార్యతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో సహచర కూలీని కర్రతో కొట్టి హత్య చేసిన బిట్టు కుమార్‌ను దోషిగా నిర్ధారించిన ప్రధాన న్యాయమూర్తి నీలిమ.. అతడికి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ విషయాన్ని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు.

కేసు వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కల్లాకల్ గ్రామంలో శ్రీరామ్ పాండరీ నిర్మిస్తున్న ఇంటి వద్ద బిట్టు కుమార్ (22) తన భార్య పూజా కుమారి, పిల్లలతో కలిసి కూలీ పనులు చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. అదే ఇంటిలో మేస్త్రీగా ప్రమోద్ పాశ్వాన్ (43) కూడా పనిచేస్తూ నివసించేవాడు.

ప్రమోద్ పాశ్వాన్ తన భార్యతో చనువుగా ఉంటున్నాడని బిట్టు కుమార్ అనుమానించాడు. ఈ విషయంపై గతంలో రెండు, మూడు సార్లు ప్రమోద్‌ను హెచ్చరించినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన బిట్టు కుమార్, మరోసారి అలా ప్రవర్తిస్తే హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో 2024 నవంబర్ 16న సాయంత్రం బిట్టు కుమార్, ప్రమోద్ పాశ్వాన్ కలిసి సరుకులు తీసుకురావడానికి బయటకు వెళ్లారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. బిట్టు కుమార్ సరుకులను తన భార్యకు ఇచ్చి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ప్రమోద్ పాశ్వాన్ తన భార్య నడుముపై చేయి వేసి ఉండటాన్ని గమనించాడు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బిట్టు కుమార్.. ప్రమోద్‌ను ఎందుకు అలా చేస్తున్నావని ప్రశ్నించాడు. దీనికి ప్రమోద్ దురుసుగా సమాధానం ఇవ్వడంతో పాటు బిట్టు కుమార్‌ను తోసివేశాడు. దీంతో మరింత ఆగ్రహించిన బిట్టు కుమార్ మంచంపై ఉన్న కర్రతో ప్రమోద్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ప్రమోద్ పాశ్వాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారై పటాన్‌చెరువుకు వెళ్లాడు.

ఈ ఘటనపై మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి కేసు దర్యాప్తు అధికారి సీఐ రంగకృష్ణ సమగ్రంగా దర్యాప్తు నిర్వహించి కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించారు. అనంతరం నిందితుడిపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ బలమైన వాదనలు వినిపించారు.

పోలీసులు కోర్టుకు సమర్పించిన సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి నీలిమ.. బిట్టు కుమార్‌ను దోషిగా నిర్ధారించారు. అతడికి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

ఈ కేసులో కోర్టు లైజనింగ్ అధికారులుగా ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ మహిపాల్ రెడ్డి కీలకంగా సహకరించారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి, పూర్తి స్థాయి సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించిన దర్యాప్తు అధికారులు, కోర్టు లైజనింగ్ అధికారులు, సాక్ష్యాధారాల సేకరణలో సహకరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793