ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు
క్షతగాత్రుల్లో ముగ్గురు దక్షిణ కొరియా పర్యాటకులు
జూలూరుపాడు మండలం వినోభానగర్ సమీపంలోని తల్లాడ – కొత్తగూడెం ప్రధాన రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆళ్లపల్లి మండలం రామాంజిగూడెంకు చెందిన వానపాకుల సాంబశివరావు (24) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతను తన భార్య సంధ్య, మరదలు శ్రీలతతో కలిసి ఏపీ రాష్ట్రం కుక్కునూరు మండలం వెలేరుకు జరిగిన పెళ్లి కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాంబశివరావు హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్నట్లు సమాచారం.
దక్షిణ కొరియా పర్యాటకులకు గాయాలు
ఇదే సమయంలో మరో కారు హైదరాబాద్ నుండి భద్రాచలం వెళ్తుండగా దాంట్లో దక్షిణ కొరియాకు చెందిన ముగ్గురు పర్యాటకులు సంకిమ్, థసిన్, సైకిమ్ ఉన్నారు. వారితో పాటు హైదరాబాద్‌కు చెందిన సాల్మన్ రాజు మరియు డ్రైవర్ దర్శికుమార్ కూడా ఉన్నారు. ఈ ఐదుగురు కూడా గాయాలపాలయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, జూలూరుపాడు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాంబశివరావు మృతి చెందాడు. కాగా, మెరుగైన వైద్యం కోసం దక్షిణ కొరియా పర్యాటకులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జూలూరుపాడు ఎస్‌ఐ బాదావత్ రవి తెలిపారు. ఇలాంటి ప్రమాదాల నివారణకు ప్రభుత్వం మార్గదర్శకాలను కట్టుబట్టిగా అమలు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొన్నారు.
Post a Comment