మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్లకు హైదరాబాద్‌లో ఘన విందు
చౌమహల్లా ప్యాలెస్‌లో సంస్కృతి, సంప్రదాయాల ప్రదర్శన
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, కంటెస్టెంట్లకు ఘనంగా విందు ఇచ్చింది. చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్ వేదికగా నిర్వహించిన ఈ ప్రత్యేక విందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ దేశాల రాయబార కార్యాలయాల ప్రతినిధులు, నగర ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొనడం విందుకు మరింత వైభవం చేకూర్చింది.
విందు ప్రారంభానికి ముందు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు “చౌమహల్లా ప్యాలెస్ – హైదరాబాద్ వారసత్వ సంపద” అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ద్వారా నగర చరిత్ర, కళాసాంస్కృతిక వైభవం, నిజాం వారసత్వాన్ని వివరించారు. అనంతరం కంటెస్టెంట్లు చౌమహల్లా ప్యాలెస్‌ను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. నిజాం కాలం నాటి వస్తువులు, ఆయుధాలు, సైనిక సామగ్రి, ఆభరణాలు, కార్ల గ్యాలరీ మొదలైనవి చూసి వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ అండ్ సీఈవో జూలియా మోర్లే మాట్లాడుతూ, “తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ నగరం అభినందనీయం. ఇక్కడి ఆతిథ్యంతో మేం మురిసిపోయాం” అని తెలిపారు. పలువురు కంటెస్టెంట్లు కూడా తమ అనుభూతులను వ్యక్తం చేశారు. వారు “చౌమహల్లా ప్యాలెస్ చూడటమంటే చరిత్రలోకి ప్రయాణించడమే. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదం మేము మా దేశాల్లో వినిపిస్తాం” అని అన్నారు.
ఈ విందు ద్వారా తెలంగాణ సంప్రదాయ ఆతిథ్యాన్ని, రాష్ట్రపు సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలిగిందని ప్రత్యేకంగా చెప్పొచ్చు. మిస్ వరల్డ్ పోటీ నేపథ్యంలో రాష్ట్రం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడంలో ఈ కార్యక్రమం ముఖ్యపాత్ర పోషించింది.
Post a Comment