తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులకు ముస్తాబైన సినీ రంగం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ప్రతిష్టాత్మక ‘తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు’ అందుకోబోతున్న సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్య కారులు, సాంకేతిక నిపుణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సినీ కళను ప్రపంచ స్థాయిలో నిలిపేలా ఈ అవార్డులు ఒక మైలురాయిగా నిలుస్తాయని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ పేరు మీదుగా అవార్డులు ఇవ్వటం గర్వకారణమని తెలిపారు. కళారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రతిభావంతులకే ఈ అవార్డులు దక్కుతాయని వెల్లడించారు.
2014 నుంచి 2024 మధ్య కాలంలో విడుదలైన ఉత్తమ తెలుగు చిత్రాలకు, నటన, దర్శకత్వం, సంగీతం, రచన, నిర్మాణం తదితర విభాగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఈ అవార్డులు అందజేయనున్నారు. చలనచిత్ర పరిశ్రమకు సేవలందించిన ప్రముఖులకు ప్రత్యేకంగా వైతాళిక పురస్కారాలు కూడా ప్రకటించారు.
ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించిన జ్యూరీ సభ్యుల కృషిని సీఎం ప్రశంసించారు. వారి సమీక్ష, పరిశీలన వల్లే నిజమైన ప్రతిభకు గుర్తింపు లభించిందన్నారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవం జూన్ 14, శనివారం నాడు హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, కళాకారులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. వేడుకలు అత్యంత వైభవంగా, జ్ఞాపకంగా జరగనున్నాయని అధికారులు తెలిపారు..
Post a Comment