-->

అదనపు కట్నం వేధింపులో నిందితునికి ఆరు నెలల జైలు శిక్ష

అదనపు కట్నం వేధింపులో నిందితునికి ఆరు నెలల జైలు శిక్ష


కొత్తగూడెం లీగల్:: అదనపు కట్నం వేధింపు కేసులో నిందితుడు మలోత్ జానకిరామ్‌కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2,000/- జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కె. సాయి శ్రీ బుధవారం తీర్పు వెలువరించారు.

కేసు వివరాలు:
జూలూరుపాడు మండలం బేతలపాడు గ్రామానికి చెందిన మాలోత్ అరుణ 2012 జూన్ 14న చుంచుపల్లి మండలం నందతండాకు చెందిన మలోత్ జానకిరామ్‌తో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.4 లక్షల నగదు, ఆరు తులాల బంగారం, హీరో హోండా గ్లామర్ బైక్, రూ.50,000/- విలువైన గృహోపకరణాలు ఇచ్చినట్లు బాధితురాలు పేర్కొన్నారు.

మొదట ఒక సంవత్సరం సజావుగా గడిచిన కాపురంలో, తరువాత భర్త జానకిరామ్ మద్యపానం, చేయిచేయి చేసుకోవడం, మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తేవాలని ఒత్తిడి చేయడంతోపాటు, ‘తీసుకురాకపోతే మరో పెళ్లి చేసుకుంటా’ అని బెదిరించేవాడని ఫిర్యాదులో తెలిపారు.

ఈ వేధింపులకు మద్దతుగా అతని తల్లి సోనా, ఆడబిడ్డ భూక్యా విజయ, ఆమె కుమారులు మోహన్, యోగేష్‌లు కూడా ఒత్తిడి చేసేవారని బాధితురాలు ఆరోపించారు. పెద్దమనుషుల మధ్య పంచాయతీలు జరిగినా ఫలితం లేకపోవడంతో, చివరికి బాధితురాలిని ఇంటి నుండి వెళ్లగొట్టారు.

2016 నవంబర్ 26న అప్పటి సబ్‌ఇన్‌స్పెక్టర్ ఈ. రాజేష్ వద్ద ఫిర్యాదు నమోదైంది. అనంతరం దర్యాప్తు జరిపి, ఐదుగురిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

కోర్టు తీర్పు:
మలోత్ జానకిరామ్‌పై నేరం రుజువుకావడంతో ఆరు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. అయితే, మలోత్ సోనా, భూక్యా విజయ, భూక్యా మోహన్, భూక్యా యోగేష్‌లపై నేరం రుజువు కాలేదని కోర్టు కేసును కొట్టివేసింది.

ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ విశ్వశాంతి వాదనలు వినిపించారు.
జూలూరుపాడు ఎస్సై బి. రవికుమార్, కోర్టు నోడల్ ఆఫీసర్ ఆర్. ప్రభాకర్, లైజన్ ఆఫీసర్ శ్రీనివాస్, కోర్టు పిసి పి. ఉపేందర్‌రావు సహకరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793