కూలీ పని ముసుగులో గంజాయి దందా… వలవేసి పట్టుకున్న ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
మెదక్, సెప్టెంబర్ 17: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని పారిశ్రామికవాడలో కూలీ పనిమీద వచ్చినట్లు నటిస్తూ గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి (డీపీఈవో) ఆదేశాల మేరకు మనోహరాబాద్ పరిశ్రమల ప్రాంతంలో అక్రమ గంజాయి వ్యాపారంపై నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కావేరి పైప్స్ కంపెనీ సమీపంలో ఎస్.ఎస్.ఏ.ఎఫ్ కోల్డ్ స్టోరేజ్‌లో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ముకేశ్ కుమార్ మండల్ (29 సంవత్సరాలు) స్థానిక యువకులకు గంజాయి విక్రయిస్తున్నాడనే సమాచారం ఆధారంగా దాడి చేశారు.
పోలీసులు అతడిని పట్టుకుని గదిని తనిఖీ చేయగా, 1.350 కిలోల గంజాయి లభించింది. అధిక లాభాలు ఆశించి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నాడని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి, మొబైల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. అనంతరం నిందితుడిని ఎస్.హెచ్.ఓ నర్సాపూర్‌కి అప్పగించారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ గోపాల్ మాట్లాడుతూ, అక్రమంగా మత్తు పదార్థాలు కలిగి ఉన్నా, విక్రయించినా, వాడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దాడిలో ఎస్సై బాలయ్య, హెడ్‌కానిస్టేబుల్ చంద్రయ్య, కానిస్టేబుళ్లు రాజు, నరేష్, రవి, హరీష్ పాల్గొన్నారు.

Post a Comment