ఖమ్మం నగరంలో విషాదం.. ఇద్దరు చిన్నారులకు ఎలుకల మందు తినిపించగా మృతి
ఖమ్మం నగరంలో విషాదం.. ఇద్దరు చిన్నారులకు ఎలుకల మందు తినిపించగా మృతి
ఖమ్మం నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి తన ఇద్దరు చిన్నారులకు ఎలుకల మందు కలిపిన ఆహారం తినిపించడంతో వారు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
స్థానికుల వివరాల ప్రకారం, లింగరాజు–స్వాతి దంపతులు గత రెండు సంవత్సరాలుగా ఖమ్మం నగరంలోని పంపింగ్ వెల్ రోడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఆరు సంవత్సరాలు, ఐదు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబం స్వగ్రామం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు గ్రామం.
ఇటీవల స్వగ్రామంలోనే నివాసం ఉండాలని భర్త సూచించడంతో దంపతుల మధ్య తరచూ విభేదాలు నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం భర్త ఇంటి బయటకు వెళ్లిన సమయంలో స్వాతి తన ఇద్దరు కుమారులకు ఆహారంలో ఎలుకల మందు కలిపి తినిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పిల్లలు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. చిన్నారుల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారుల మృతికి దారితీసిన పరిస్థితులు, కుటుంబ కలహాల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ కొనసాగుతోంది.
ఈ విషాద ఘటన ఖమ్మం నగరంలో తీవ్ర కలకలం రేపగా, చిన్నారుల మృతితో గుర్రాలపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.

Post a Comment