-->

ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సేవల కోసం EHCT బోర్డు పునర్వ్యవస్థీకరణ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

 

ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సేవల కోసం EHCT బోర్డు పునర్వ్యవస్థీకరణ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సేవల కోసం EHCT బోర్డు పునర్వ్యవస్థీకరణ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, జూన్ 17: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) అమలు, ఆరోగ్య సేవల పర్యవేక్షణ మరియు హెల్త్ కార్డుల జారీ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెం.40ను విడుదల చేసింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య పథకాల అమలును పర్యవేక్షించే EHCT బోర్డులో వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులను సభ్యులుగా నియమించారు.

బోర్డు చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరించనుండగా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ట్రస్టీగా ఉంటారు. వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, హోంశాఖ, సాధారణ పరిపాలన శాఖ, మున్సిపల్ పరిపాలన, పంచాయతీరాజ్, షెడ్యూల్డ్ కులాలు, కార్మిక శాఖ తదితర శాఖల కార్యదర్శులు సభ్యులుగా కొనసాగనున్నారు.

అలాగే ఉద్యోగ సంఘాల నుంచి టీఎన్జీవో, టీజీవో, పీఆర్‌టీయూ తెలంగాణ, టీఎస్ యూటీఎఫ్, తెలంగాణ సచివాలయ సంఘం, టీఎస్‌టీఏ, డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తెలంగాణ క్లాస్-4 ఉద్యోగుల సంఘం తదితర సంస్థల ప్రతినిధులకు బోర్డులో స్థానం కల్పించారు. పెన్షనర్ల తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పదవీ విరమణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, తెలంగాణ మహిళా పెన్షనర్ల సంఘం ప్రతినిధులను సభ్యులుగా నియమించారు.

ఉత్తర్వుల ప్రకారం, బోర్డు తొలి సమావేశాన్ని త్వరలో నిర్వహించి ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలను సమీక్షించి అవసరమైన మార్పులు, సవరణలపై నిర్ణయాలు తీసుకోనుంది. అదనంగా ఉద్యోగులు, పెన్షనర్లకు జారీ చేసే హెల్త్ కార్డుల విధానం, సేవల అందుబాటు, ఆసుపత్రుల అనుసంధానం వంటి అంశాలపై కూడా సిఫార్సులు చేయనుంది.

రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ) మరియు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సీఈఓ ఈ ఉత్తర్వుల అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య సేవలు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అందే అవకాశాలు మెరుగుపడనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793