రైలు దొంగల ముఠా కలకలం.. దుండగులపై 9 రౌండ్ల కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు
బాపట్లలో రైలు దొంగల ముఠా కలకలం.. దుండగులపై 9 రౌండ్ల కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు
బాపట్ల, జూన్ 15: బాపట్ల జిల్లాలో రైలు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకున్న దొంగల ముఠా మరోసారి రెచ్చిపోయింది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా వారి ఆభరణాలను దోచుకునేందుకు ప్రయత్నించిన దుండగులు, ప్రతిఘటన ఎదురవడంతో పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్) సిబ్బంది తొమ్మిది రౌండ్ల కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది.
తమిళనాడులోని చెంగల్పట్టు నుంచి కాకినాడకు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున సుమారు 1.15 గంటల సమయంలో బాపట్ల-అప్పికట్ల రైల్వే స్టేషన్ల మధ్య నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఈ దోపిడీ జరిగింది.
రైలులోని ఎస్-3, ఎస్-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళల మెడల నుంచి సుమారు ఏడు సవర్ల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించినట్లు సమాచారం. అయితే చోరీని గుర్తించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో పాటు అత్యవసర చైన్ లాగి రైలును నిలిపివేశారు.
రైలు ఆగగానే దుండగులు చీకటిని ఆసరాగా చేసుకుని రైలు నుంచి దిగి సమీప పొలాల గుండా బాపట్ల-గుంటూరు ప్రధాన రహదారి వైపు పారిపోయారు. వారిని వెంటాడిన ఎస్కార్ట్ విధుల్లో ఉన్న రైల్వే రక్షణ సిబ్బంది హెచ్చరికగా, పట్టుకునే ప్రయత్నంలో మొత్తం తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపారు. అయినప్పటికీ దుండగులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గ్రామీణ పోలీసులు, రైల్వే పోలీసులు, ప్రత్యేక బృందాలు కలిసి అప్పికట్ల, బత్తిపూడి గ్రామాల పరిసర ప్రాంతాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి.
ప్రాథమిక విచారణలో ఈ చోరీకి ఆరుగురు సభ్యుల దొంగల ముఠా పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటనతో రాత్రివేళల్లో రైలు ప్రయాణాల భద్రతపై ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులు మాత్రం దుండగులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.

Post a Comment