-->

విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

అహ్మదాబాద్: గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ బంగారం స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇండిగో విమానంలో అత్యంత చాకచక్యంగా దాచిపెట్టిన రూ.4.26 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

జూన్ 12న దుబాయ్ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్న విమానంలో అక్రమంగా బంగారం తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం కస్టమ్స్ అధికారులకు అందింది. దీంతో అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్ల సహకారంతో విమానం ముందు భాగంలోని టాయిలెట్‌లోని అనౌన్స్‌మెంట్ స్పీకర్ బాక్స్‌ను పరిశీలించగా, దాని వెనుక భాగంలో నల్లటి ప్లాస్టిక్ టేపుతో చుట్టిన రెండు అనుమానాస్పద పౌచ్‌లు కనిపించాయి.

పౌచ్‌లను తెరిచి చూడగా అందులో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 24 విదేశీ బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి మొత్తం బరువు 2,799.3 గ్రాములు (సుమారు 2.8 కిలోలు) కాగా, అంతర్జాతీయ మార్కెట్ విలువ రూ.4,26,89,325గా అధికారులు అంచనా వేశారు.

ఈ బంగారం తమదేనని ప్రయాణికులు గానీ, విమాన సిబ్బంది గానీ ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో, కస్టమ్స్ చట్టం-1962 ప్రకారం దీనిని ‘అన్‌క్లెయిమ్డ్ ప్రాపర్టీ’గా పరిగణించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక విచారణలో భాగంగా, అంతర్జాతీయ ప్రయాణం ముగిసిన తర్వాత విమానం దేశీయ సర్వీసుల్లోకి మారిన సమయంలో గ్రౌండ్ స్టాఫ్ లేదా స్థానిక వ్యక్తుల సహాయంతో బంగారాన్ని బయటకు తరలించేలా స్మగ్లర్లు పథకం రచించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ భారీ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. విమాన మార్గాలను ఉపయోగించి జరుగుతున్న అక్రమ బంగారం రవాణాపై మరింత నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793