గోదావరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు నీటిలో మునిగి మృతి
గోదావరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు నీటిలో మునిగి మృతి
ముథోల్, జూన్ 9: హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొడుకు అక్షరాభ్యాసం కార్యక్రమం కోసం ఆనందంగా బాసరకు వచ్చిన కుటుంబానికి ఊహించని దుర్ఘటన ఎదురైంది. గోదావరి నదిలో స్నానానికి దిగిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కాచిగూడ చప్పల్‌బజార్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ (38), రాంచందర్ (36), మల్లేశ్‌కుమార్ (31) అన్నదమ్ములు కుటుంబ సభ్యులతో కలిసి బాసరకు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం బాసర ట్రిపుల్ ఐటీ ఇంటెక్‌వెల్ సమీపంలోని గోదావరి నది వద్ద స్నానానికి దిగారు.
స్నానం చేస్తూ ఉండగా వారు తెలియకుండానే లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో నది ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారు. ముగ్గురు కనిపించకపోవడంతో ఘాట్‌పై ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. గంటల పాటు సాగిన శోధన అనంతరం ముగ్గురు అన్నదమ్ముల మృతదేహాలను వెలికితీశారు.
ముగ్గురు కుమారులు ఒకేసారి మృతి చెందారనే వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆనందంగా ప్రారంభమైన యాత్ర విషాదాంతంగా మారడంతో అక్కడి వాతావరణం కన్నీటి పర్యంతమైంది. బంధువుల రోదనలతో గోదావరి ఘాట్ ప్రాంతం దద్దరిల్లింది.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు బాసర సీఐ దీపక్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment