-->

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు, ఇద్దరు మహిళలు సహా చిన్నారి మృతి

 

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు, ఇద్దరు మహిళలు సహా చిన్నారి మృతి

సిద్ధిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంట్లోకి దూసుకెళ్లిన కారు, ఇద్దరు మహిళలు సహా చిన్నారి మృతి

సిద్ధిపేట, జూన్ 14: సిద్ధిపేట జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న వృద్ధుడిని ఢీకొట్టిన అనంతరం నేరుగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని మసీదు సమీపానికి చేరుకోగానే అదుపుతప్పింది. ముందుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధుడిని ఢీకొట్టిన కారు, ఆ తర్వాత పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.

ఆ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను కారు బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులను కందుగుల రాధవ్వ, కెమ్మసారం లక్ష్మి మరియు ఒక చిన్నారిగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు తెలిపారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వృద్ధుడిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు.

ఇంట్లో ఇరుక్కుపోయిన కారును క్రేన్ సహాయంతో బయటకు తీసిన అనంతరం మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

ఈ విషాద ఘటనతో దుద్దెడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలిచివేశాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793