భద్రాద్రి కొత్తగూడెంలో దారుణ ఘటన.. గర్భిణీ చితాభస్మంలో బయటపడ్డ కత్తెర
భద్రాద్రి కొత్తగూడెంలో దారుణ ఘటన.. గర్భిణీ చితాభస్మంలో బయటపడ్డ కత్తెర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలకు దారితీసిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. గుండాల మండలం శంభూనిగూడెం గ్రామానికి చెందిన గర్భిణీ వనజ (20)కు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ నర్సు సాధారణ ప్రసవం నిర్వహించినట్లు సమాచారం. అయితే నర్సు అవగాహన లోపం కారణంగా శిశువు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర రక్తస్రావానికి గురైన వనజ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటన అనంతరం తల్లీబిడ్డలకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే వనజ చితాభస్మాన్ని కుటుంబ సభ్యులు సేకరిస్తుండగా, అందులో శస్త్రచికిత్సల సమయంలో ఉపయోగించే కత్తెర బయటపడటం సంచలనంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి, బిడ్డ ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
కత్తెర బయటపడటం వైద్య నిర్లక్ష్యానికి నిదర్శనమని బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఆసుపత్రి వైద్యాధికారులు మాత్రం ఆసుపత్రిలో సాధారణ ప్రసవమే జరిగిందని, చితాభస్మంలో కత్తెర ఎలా వచ్చిందో తమకు తెలియదని పేర్కొంటున్నారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment