ఉద్యోగాల పేరిట రూ.52 లక్షల మోసం.. మహిళ అరెస్ట్
ఉద్యోగాల పేరిట రూ.52 లక్షల మోసం.. మహిళ అరెస్ట్
నెల్లూరు జిల్లా సైదాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కలువాయి మండలం చవటపల్లి గ్రామానికి చెందిన రజిత అలియాస్ రమ్యపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు రాపూరు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
సీఐ వివరాల ప్రకారం, సైదాపురం మండలం కలిచేడు గ్రామానికి చెందిన పూజారి చందన అనే మహిళకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (SBI) జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తానని రజిత నమ్మబలికింది. ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని చెప్పి పోలీస్ వెరిఫికేషన్, ఐడీ కార్డులు, అపాయింట్‌మెంట్ లెటర్లు అందిస్తానంటూ విడతల వారీగా రూ.52.64 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తర్వాత బాధితురాలికి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు, ఈ-మెయిల్స్, ఇతర నకిలీ ధ్రువపత్రాలు అందించినట్లు పోలీసులు గుర్తించారు. ఉద్యోగం రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, సమాధానం చెప్పకుండా బెదిరింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, రజిత డబ్బులు తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ కావడంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆ కోణంలోనూ విచారణ కొనసాగుతున్నట్లు సీఐ తెలిపారు.
ఇదిలా ఉండగా, రజితపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ పలువురు బాధితులు ఉన్నట్లు సమాచారం. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మవద్దని, అలాంటి ఘటనలపై వెంటనే 112 లేదా 1930 హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుల రికవరీ, వారికి న్యాయం జరిగే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Post a Comment