-->

చిన్న పామే కదా.. ఏం చేస్తుందిలే యువ వ్యాపారవేత్త ప్రాణాలు బలిగొన్న పాము

 

చిన్న పామే కదా.. ఏం చేస్తుందిలే యువ వ్యాపారవేత్త ప్రాణాలు బలిగొన్న పాము

చిన్న పామే కదా.. ఏం చేస్తుందిలే యువ వ్యాపారవేత్త ప్రాణాలు బలిగొన్న పాము 

హైదరాబాద్: "చిన్న పామే కదా.. ఏం చేస్తుందిలే" అనే నిర్లక్ష్యం ఓ యువ వ్యాపారవేత్త ప్రాణాలను బలిగొంది. స్నేహితులను సరదాగా భయపెట్టేందుకు చేతిలో పట్టుకున్న విషసర్పం కాటు వేయడంతో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ బాబ్రీహిల్స్‌కు చెందిన నవాబ్ సయ్యద్ జుమైద్ మొహియుద్దీన్ హుస్సేనీ (30) వ్యాపారవేత్త. ఆయనకు మొయినాబాద్ ప్రాంతంలో ఫామ్‌హౌస్ ఉంది. ఈ నెల 17న రాత్రి స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లి సరదాగా గడుపుతుండగా, 18వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఫామ్‌హౌస్‌లోకి ఒక చిన్న కట్లపాము (క్రైట్) వచ్చింది.

పాము చిన్నదిగా ఉండటంతో భయపడని మొహియుద్దీన్ దానిని చేత్తో పట్టుకున్నారు. అనంతరం స్నేహితులను భయపెట్టేందుకు ఆ పాముతో సరదాగా ఆటలాడారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆ విషసర్పం ఆయన కుడిచేతి బొటనవేలిని గట్టిగా కరిచింది. వెంటనే పామును దూరంగా విసిరేసినప్పటికీ అప్పటికే విషం శరీరంలోకి చేరింది.

పాము కరిచిన వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని స్నేహితులు సూచించినా, "చిన్న పామే కదా.. ఏం కాదులే" అంటూ మొహియుద్దీన్ నిర్లక్ష్యం చేశారు. దాదాపు గంట తర్వాత విషప్రభావ లక్షణాలు కనిపించడంతో మెహదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది.

దీంతో వైద్యులు ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

మృతుడికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. చిన్న నిర్లక్ష్యం కారణంగా కుటుంబ పెద్దను కోల్పోవడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

పాముకాటు విషయంలో నిర్లక్ష్యం ప్రాణాంతకం

వైద్య నిపుణులు సూచించిన ప్రకారం, పాము చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా ఏ పాముకాటునైనా అత్యవసర పరిస్థితిగా పరిగణించి వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లాలి. ముఖ్యంగా క్రైట్ వంటి విషసర్పాల కాటు ప్రారంభంలో పెద్దగా నొప్పి లేకపోయినా, కొద్ది గంటల్లోనే తీవ్రమైన విషప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793