రెండు రోజులుగా ఒకే చోట పార్కింగ్ చేసిన కారులో మహిళ మృతదేహం
రెండు రోజులుగా ఒకే చోట పార్కింగ్ చేసిన కారులో మహిళ మృతదేహం
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కలకలం.. కారులోంచి దుర్వాసన రావడంతో వెలుగులోకి ఘటన
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కారులో మహిళ మృతదేహం లభ్యమవడం తీవ్ర కలకలం రేపింది. బస్టాండ్ సమీపంలో ఓ కారు రెండు రోజులుగా ఒకే చోట పార్క్ చేసి ఉండటంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. దీనికితోడు వాహనం నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎల్కతుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును పరిశీలించారు. అనంతరం కారు డిక్కీ తెరిచి చూడగా.. అందులో మూటకట్టిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతురాలు మానసగా గుర్తింపు
కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. మృతురాలు గోదావరిఖనికి చెందిన మానస (33)గా గుర్తించినట్లు సమాచారం. కాగా, ఆ కారును మానసకు పరిచయమైన వినోద్ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు వినోద్‌పై అనుమానం వ్యక్తం చేసి అతడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం.
ఫిట్స్ రావడంతో మృతి చెందిందని చెప్పిన వినోద్
మానసతో తనకు పరిచయం ఉందని వినోద్ పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లోని ఓ గదిలో ఇద్దరూ ఉన్న సమయంలో మానసకు ఫిట్స్ వచ్చి నోటి నుంచి నురగలు రావడంతో ఆమె మృతి చెందినట్లు అతడు చెప్పినట్లు సమాచారం.
మానస మృతి చెందడంతో భయపడిపోయిన తాను మృతదేహాన్ని అక్కడే ఉంచకుండా కారులో తరలించి ఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలో వదిలి వెళ్లినట్లు వినోద్ పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది.
అయితే వినోద్ చెబుతున్న వివరాలు నిజమేనా? మానస మృతికి అసలు కారణం ఏమిటి? ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫోరెన్సిక్, వైద్య నివేదికలపై ఉత్కంఠ
మానస చివరిసారిగా ఎవరితో ఉంది, ఆమె ఎక్కడ మృతి చెందింది, మృతదేహాన్ని ఎల్కతుర్తికి ఎందుకు తీసుకొచ్చారు, కారును ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వంటి అంశాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. వినోద్ చెప్పిన వివరాలను ఇతర ఆధారాలతో సరిపోల్చుతున్నారు.
మృతదేహానికి నిర్వహించే పోస్టుమార్టం, వైద్య, ఫోరెన్సిక్ పరీక్షల నివేదికలు మృతికి అసలు కారణాన్ని నిర్ధారించడంలో కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్కతుర్తి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Post a Comment