-->

డిప్యూటీ తహసీల్దార్‌గా శిక్షణ పొందుతున్న యువతి ఆత్మహత్య

 

డిప్యూటీ తహసీల్దార్‌గా శిక్షణ పొందుతున్న యువతి ఆత్మహత్య

మహబూబాబాద్‌లో విషాదం.. డిప్యూటీ తహసీల్దార్‌గా శిక్షణ పొందుతున్న యువతి ఆత్మహత్య

మహబూబాబాద్: రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్‌గా శిక్షణ పొందుతున్న 28 ఏళ్ల యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఉద్యోగ జీవితంలో మంచి స్థాయికి చేరుకున్న సమయంలో ఆమె మృతి చెందడం కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

టౌన్ సీఐ ఎల్. రఘుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కేఎస్‌ఎన్ రెడ్డి ఇంటి సమీపంలో అద్దెకు ఉంటున్న దోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల చిన్న కుమార్తె దోలి సంధ్య (28) స్థానిక మున్సిపాలిటీలో గతంలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించింది. అనంతరం గ్రూప్-2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం పొందింది.

ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా శిక్షణ పొందుతూ విధులు నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం సంధ్య తల్లిదండ్రులు కొంతసేపు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న సంధ్య ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

కొంతసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తల్లి పద్మ.. కుమార్తె ఉరేసుకుని ఉండటాన్ని గుర్తించి వెంటనే చుట్టుపక్కల వారికి, భర్త వెంకటేశ్వర్లుకు సమాచారం అందించింది. అనంతరం వెంకటేశ్వర్లు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, క్రైం ఎస్సై వెంకటేశ్వర్లు, టౌన్ ఎస్సై సూరయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.

సంధ్య ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు.

ఇటీవలే ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సంధ్య అందరి ప్రశంసలు పొందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత ఉద్యోగాన్ని సాధించి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సమయంలో ఆమె మృతి చెందడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793