తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక: ఎంపీ వద్దిరాజు
సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ ఆడబిడ్డలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ ప్రకృతికి, పూలకు, గౌరమ్మకు పూజలు చేసే విశిష్టమైన పండుగ అని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగను ఆడబిడ్డలు తమ బంధుమిత్రులతో కలిసి ఎంతో ఇష్టంగా, ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకుంటారని తెలిపారు.
బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా తంగేడు, గునుగు, గుమ్మడి, బంతి, చామంతి తదితర రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, పిల్లాపాపలతో కలిసి ఆడిపాడుతూ పండుగను ఘనంగా నిర్వహిస్తారని చెప్పారు.
అనాదిగా విశిష్టతను సంతరించుకున్న బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుందని ఎంపీ రవిచంద్ర తన సందేశంలో పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సాగిన ఉద్యమంలో బతుకమ్మ పండుగ ప్రజలను మరింత ఐకమత్యంతో ముందుకు నడిపించిందని గుర్తుచేశారు.
కేసీఆర్ పాలనలో బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించడంతో పాటు, దానికి మరింత ప్రాచుర్యం కల్పించారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపు లభించిందని, ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో సైతం ‘బతుకమ్మ’ పదానికి చోటు లభించిందని వివరించారు.
ఈ సంతోషకరమైన పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని మహిళామణులతో పాటు దేశవిదేశాల్లో స్థిరపడిన, నివసిస్తున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మరోసారి హృదయపూర్వక సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment