పాల్వంచలో తూనికల్లో మాయాజాలం.. వ్యాపారులపై అధికారుల కొరడా
పాల్వంచలో తూనికల్లో మాయాజాలం.. వ్యాపారులపై అధికారుల కొరడా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో వినియోగదారులను తక్కువ తూకాలతో మోసం చేస్తున్న వ్యాపారులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. పట్టణంలోని చికెన్ సెంటర్లు, చేపల విక్రయ కేంద్రాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా దుకాణాల్లో వినియోగిస్తున్న తూనికల కాటాలను అధికారులు పరిశీలించారు. కొన్ని కేంద్రాల్లో తూకం కాటాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. అసలు బరువు ఒకటిగా ఉండగా, తూనికల ద్వారా చూపించే బరువును మార్చి వినియోగదారులను మోసం చేస్తున్న వ్యవహారం అధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది.
వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తక్కువ తూకాలు వేసి దోచుకోవడం ఏమాత్రం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తూనికలను వినియోగించిన వ్యాపారులపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇకపై తూనికల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. వినియోగదారులు కూడా కొనుగోలు సమయంలో తూకాన్ని పరిశీలించాలని, అనుమానం కలిగితే వెంటనే సంబంధిత తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Post a Comment