జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోరం.. బ్రేక్ సెట్టింగ్ చేస్తుండగా మెకానిక్ మృతి
జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోరం.. బ్రేక్ సెట్టింగ్ చేస్తుండగా మెకానిక్ మృతి
డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్: జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో మంగళవారం (ఆగస్టు 11) విషాదకర ఘటన చోటుచేసుకుంది. బస్సుకు బ్రేక్ సెట్టింగ్ చేస్తున్న ఓ మెకానిక్‌పై నుంచి అదే బస్సు వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో సంతోష్ ఫస్ట్ షిఫ్ట్ మెకానిక్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం డ్యూటీలో ఉన్న సమయంలో ఓ డ్రైవర్ బస్సుకు బ్రేక్ సెట్టింగ్ చేయాల్సి ఉండటంతో సంతోష్‌ను సంప్రదించాడు. దీంతో మెకానిక్ బస్సుకు బ్రేక్ సెట్టింగ్ పనులు చేపట్టాడు.
పని పూర్తి చేసిన అనంతరం సంతోష్ బస్సు నుంచి బయటకు వస్తున్న సమయంలో అనూహ్యంగా డ్రైవర్ బస్సును ముందుకు కదిలించినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు టైర్లు సంతోష్‌పై నుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఘటనతో డిపోలో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. సంతోష్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తోటి సిబ్బంది కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బస్సు కదిలే సమయంలో డ్రైవర్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందా? మెకానిక్ బ్రేక్ సెట్టింగ్ పనులు పూర్తిచేసే వరకు బస్సును కదపకుండా భద్రతా చర్యలు పాటించారా? అనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Post a Comment