ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి యువ క్రీడాకారులు పాల్గొనే ఈ క్రీడా వేడుకకు ఇప్పటి నుంచే పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లు, నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీల నిర్వహణకు సంబంధించిన మౌలిక వసతులు, స్టేడియంల అభివృద్ధి, క్రీడాకారులు, అతిథులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు.
డిసెంబరులో పోటీలు నిర్వహించేలా ఏర్పాట్లు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా దాదాపు 20 రకాల క్రీడా విభాగాల్లో పోటీలు జరగనున్న నేపథ్యంలో.. ప్రతి క్రీడకు అనువైన వేదికలను ముందుగానే గుర్తించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పోటీలు జరిగే ప్రదేశాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
హైదరాబాద్‌లోని ప్రస్తుత స్టేడియంల పరిస్థితిని పూర్తిస్థాయిలో పరిశీలించాలని సీఎం ఆదేశించారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా శాశ్వత ప్రాతిపదికన క్రీడా వసతులను అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ప్రారంభ, ముగింపు వేడుకలకు ప్రముఖుల భాగస్వామ్యం
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవం, ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను భాగస్వాములను చేసేందుకు కసరత్తు ప్రారంభించాలన్నారు.
క్రీడాకారులు, జాతీయ స్థాయి ప్రతినిధులు, ఇతర అతిథులకు అవసరమైన వసతి, రవాణా, భద్రత, ఇతర సౌకర్యాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, అతిథుల సౌకర్యాల కోసం అధికారులకు పని విభజన చేసి స్పష్టమైన బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు.
తెలంగాణ క్రీడా ప్రతిభకు ప్రాధాన్యం
తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు జాతీయ స్థాయి క్రీడా ప్రతినిధులను కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని క్రీడా రంగ నిపుణులు, ప్రముఖుల సూచనలు తీసుకుని ఏర్పాట్లను మరింత మెరుగ్గా చేపట్టాలని అన్నారు.
దేశవ్యాప్తంగా యువ క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలు తెలంగాణ క్రీడా స్ఫూర్తిని చాటేలా, అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATG) చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, SATG ఎండీ ఎ. సోనీబాల దేవి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment