జహీరాబాద్ హైవేపై ఘోర విషాదం.. వరుస ప్రమాదాల్లో 9 మంది మృతి
జహీరాబాద్ హైవేపై ఘోర విషాదం.. వరుస ప్రమాదాల్లో 9 మంది మృతి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని జాతీయ రహదారిపై కొద్దిసేపటి వ్యవధిలోనే జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు తొమ్మిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. మొదటి ప్రమాదంలో కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే అదే హైవేపై మూడు కార్లు వరుసగా ఢీకొని మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో హైవేపై భీతావహ పరిస్థితి నెలకొంది.
ట్యాంకర్ ఢీకొని ఏడుగురు కూలీలు మృతి
జహీరాబాద్ మండలం సత్వార్ సరిహద్దుల వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి చెందిన 14 మంది వ్యవసాయ కూలీలు నిత్యం మాదిరిగానే పొలం పనుల కోసం ఆటోలో జహీరాబాద్ పరిసర ప్రాంతాలకు బయలుదేరారు.
అయితే మార్గమధ్యంలో వేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్ అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించడంతో వారి బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
అదే హైవేపై మరో ప్రమాదం.. ఇద్దరి మృతి
మొదటి ప్రమాదం కారణంగా హైవేపై భయానక పరిస్థితి నెలకొన్న సమయంలోనే అదే రహదారిపై మరో ప్రమాదం చోటుచేసుకుంది. మూడు కార్లు ఒకదానినొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
రక్తసిక్తమైన హైవే
ఒకే జాతీయ రహదారిపై స్వల్ప వ్యవధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. క్షతగాత్రుల ఆర్తనాదాలు, మృతదేహాలతో ఆ ప్రాంతం విషాదంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదాలకు గల కారణాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదాలు జరిగాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Post a Comment