-->

నాలుగో తరగతి విద్యార్థికి 'అ' రాయడం రాదా?.. ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే తనిఖీ

 

నాలుగో తరగతి విద్యార్థికి 'అ' రాయడం రాదా?.. ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే తనిఖీ

నాలుగో తరగతి విద్యార్థికి 'అ' రాయడం రాదా?.. ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే తనిఖీ, విద్యా ప్రమాణాలపై ఆగ్రహం

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 7: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పాకాలగూడెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రమాణాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని అశ్వారావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని స్వయంగా పరీక్షించారు.

ఈ సందర్భంగా నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి కనీసం తెలుగు అక్షరం 'అ' కూడా రాయలేకపోవడం, అక్షరాలను గుర్తించలేకపోవడం ఎమ్మెల్యేను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పరిస్థితిపై ఆయన ఉపాధ్యాయులను నిలదీశారు.

ప్రాథమిక స్థాయిలోనే పిల్లలకు అక్షరాస్యత కల్పించడంలో విఫలమైతే అది అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంటే, ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సమంజసం కాదని మండిపడ్డారు.

ఐదో తరగతిలో కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నప్పటికీ, వారి విద్యా ప్రమాణాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెల్లిస్తున్న జీతాలకు తగిన విధంగా ఉపాధ్యాయులు తమ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు.

గిరిజన ప్రాంతాల పిల్లల భవిష్యత్తుతో ఎట్టి పరిస్థితుల్లోనూ చెలగాటమాడొద్దని హెచ్చరించిన ఎమ్మెల్యే, విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, చదవడం-రాయడం నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. ఇకపై ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.