-->

పాత కొత్తగూడెంలో విషాదం.. వాగులో ఆటో డ్రైవర్ మృతదేహం

 

పాత కొత్తగూడెంలో విషాదం.. వాగులో ఆటో డ్రైవర్ మృతదేహం

పాత కొత్తగూడెంలో విషాదం.. వాగులో ఆటో డ్రైవర్ మృతదేహం

కొత్తగూడెం: ఈ నెల 13వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన ఆటో డ్రైవర్ ముర్రేడు వాగులో మృతదేహంగా కనిపించడంతో పాత కొత్తగూడెంలో విషాదం నెలకొంది.

పాత కొత్తగూడెంకు చెందిన మహమ్మద్ దస్తగిరి (45) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 13వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులు, పరిచయస్తుల వద్ద వెతికినా ఆయన ఆచూకీ లభించలేదు.

ఈ క్రమంలో చాతకొండ ప్రాంతంలోని ముర్రేడు వాగులో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా అది కనిపించకుండా పోయిన మహమ్మద్ దస్తగిరిదేనని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు తెలిసింది.

దస్తగిరి కుటుంబం కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. ఆయన భార్య కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారని, దస్తగిరి సైతం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆయన అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మృతికి అసలు కారణం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

నిరుపేద కుటుంబానికి చెందిన దస్తగిరి మృతితో భార్య, పిల్లలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయామని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు అనంతరం దస్తగిరి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Blogger ఆధారితం.