రోడ్డు పక్కన కుప్పలుగా కరెన్సీ నోట్లు.. కిరాణా వ్యాపారి ఎంత పనిచేశాడు?
రోడ్డు పక్కన కుప్పలుగా కరెన్సీ నోట్లు.. కిరాణా వ్యాపారి ఎంత పనిచేశాడు?
విశాఖపట్నం: రోడ్డు పక్కన కుప్పలుగా చినిగిపోయిన కరెన్సీ నోట్లు కనిపించడంతో విశాఖపట్నంలో కలకలం రేగింది. పెద్ద మొత్తంలో రూ.500, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లు ఒకేచోట పడి ఉండటాన్ని గమనించిన వాకర్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అసలు ఈ నోట్లను ఎవరు అక్కడ పడేశారు? ఎందుకు పడేశారు? అనే ప్రశ్నలు తలెత్తాయి. పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో చివరకు ఈ మిస్టరీ వీడింది.
సెంట్రల్ పార్క్ ఎదురుగా నోట్ల కుప్ప
విశాఖపట్నం సెంట్రల్ పార్క్ ఎదురుగా రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో చినిగిపోయిన కరెన్సీ నోట్లు కనిపించాయి. పార్క్‌కు వచ్చిన వాకర్స్ వాటిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ రూ.500, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లతో పాటు ఎల్ఐసీ రసీదులు, ఓ మహిళకు సంబంధించిన పాన్ కార్డు కూడా కనిపించింది.
ఒకే ప్రాంతంలో ఇంత మొత్తంలో చినిగిపోయిన నోట్లు పడిఉండటంతో స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నోట్లను పరిశీలించారు. నోట్లు అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరు పడేశారు? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను కూడా పరిశీలించారు.
చివరకు బయటపడిన అసలు విషయం
పోలీసుల దర్యాప్తులో నోట్ల కుప్ప వెనుక ఉన్న అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేజీహెచ్ ఏరియా తాడివీధికి చెందిన ఆదిమూలం సూర్యారావు ఈ నోట్లను అక్కడికి తీసుకొచ్చి పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో పోలీసులు సూర్యారావును పిలిపించి విచారించగా ఆయన అసలు విషయం వెల్లడించినట్లు తెలిపారు. సూర్యారావు కిరాణా షాపులకు సరుకులు సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నారు. ఆయన ఇంట్లోని ఓ అట్టపెట్టెలో కొంతకాలంగా డబ్బులు, ఎల్ఐసీ రసీదులు తదితర పత్రాలను భద్రపరిచారు.
డబ్బులకు చెదపురుగులు.. అందుకే రోడ్డు పక్కన పడేశారు!
అట్టపెట్టెలో ఉంచిన డబ్బులకు చెదపురుగులు పట్టిన విషయాన్ని సూర్యారావు గమనించారు. అయితే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే ఇంట్లో వివాదం తలెత్తుతుందని భావించిన ఆయన, నోట్లను అక్కడి నుంచి తీసేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సెంట్రల్ పార్క్ ఎదురుగా ఉన్న రోడ్డు పక్కనకు నోట్లను తీసుకొచ్చి కుప్పగా పోసి వెళ్లినట్లు సూర్యారావు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
రూ.3 వేల వరకు ఉంటాయని అంచనా
నోట్లు చినిగిపోయి, చెదపురుగుల బారిన పడటంతో అవి వినియోగానికి పనికిరావని భావించి రోడ్డు పక్కన పడేసినట్లు సూర్యారావు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడ పడేసిన నోట్ల విలువ సుమారు రూ.3 వేల వరకు ఉండవచ్చని చెబుతున్నారు.
బుధవారం మధ్యాహ్నం సీఐ అప్పలనాయుడు చినిగిపోయిన నోట్లు, ఎల్ఐసీ రసీదులు, పాన్ కార్డును సూర్యారావుకు అందజేశారు.
మొత్తానికి రోడ్డు పక్కన కుప్పలుగా కనిపించిన కరెన్సీ నోట్ల వ్యవహారంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎలాంటి దొంగతనం లేదా ఇతర నేరానికి సంబంధించిన వ్యవహారం కాదని, చెదపురుగులు పట్టిన నోట్లను కిరాణా వ్యాపారి అక్కడ పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో స్థానికులకు కూడా క్లారిటీ వచ్చింది.

Post a Comment