వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి
సంగారెడ్డి జిల్లా: వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణేశ్ విగ్రహ నిమజ్జనం కోసం చెరువుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మండలం పెద్దకంజర్లలో వినాయక చవితి సందర్భంగా మూడు రోజుల పాటు గణేష్ పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం నిమజ్జనం కోసం వినాయక విగ్రహాన్ని నేరెడు చెరువుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పిల్లలు చెరువులోకి వెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఒకరు నీటిలో మునిగిపోవడంతో అతడిని కాపాడేందుకు మరో విద్యార్థి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఒకరినొకరు రక్షించుకునే క్రమంలో మొత్తం ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. చెరువులో పెద్దపెద్ద గుంతలు ఉండటంతో విద్యార్థులు నీటి లోతును అంచనా వేయలేక ప్రమాదానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.
మృతిచెందిన విద్యార్థులు శిరీష చారిటబుల్ ట్రస్ట్‌లో చదువుతున్నవారిగా గుర్తించారు. వీరు 8, 9, 10వ తరగతులు చదువుతున్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే విద్యార్థులు నీటిలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఆరుగురు విద్యార్థులు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Post a Comment