లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సింగరేణి ఇంటర్న్ విద్యార్థిని ఆత్మహత్య
లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సింగరేణి ఇంటర్న్ విద్యార్థిని ఆత్మహత్య
గోదావరిఖని: సింగరేణి సంస్థలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనపై ఓ అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడని, ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని పేర్కొంటూ ఆమె సూసైడ్ నోట్‌లో రాసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గోదావరిఖనిలో డిప్లొమా పూర్తి చేసిన యువతి ఈసెట్ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సీటు సాధించింది. ఇంజినీరింగ్‌లో భాగంగా ఇంటర్న్‌షిప్ కోసం ఈ ఏడాది సింగరేణి సంస్థలో చేరింది. ఈ క్రమంలో తాను కూడా అదే కళాశాలలో డిప్లొమా చదివానని పరిచయం చేసుకున్న బొమ్మకంటి రవికుమార్ అనే ఓవర్‌మ్యాన్ (సూపర్‌వైజర్)తో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.
అనంతరం రవికుమార్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోలేదని, దీంతో ఆమె ఇంటర్న్‌షిప్‌ను మధ్యలోనే నిలిపివేసి గోదావరిఖనిలోని ఓ కంప్యూటర్ సెంటర్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు.
అయితే పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు నవీన్‌తో పాటు రవికుమార్ తనను వేధించడం కొనసాగించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, చికిత్స పొందుతూ ఈ నెల 14న మృతి చెందినట్లు తెలిపారు.
విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు నవీన్, రవికుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు, తనపై రవికుమార్ అత్యాచారానికి పాల్పడినట్లు, ఈ విషయంపై సింగరేణి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని విద్యార్థిని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ నోట్‌ను ఆధారంగా తీసుకుని సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మృతదేహంతో ధర్నా
విద్యార్థిని ఆత్మహత్యకు బాధ్యులైన సింగరేణి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో కార్పొరేషన్ కార్యాలయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, సూసైడ్ నోట్‌లో పేర్కొన్న అంశాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సూసైడ్ నోట్, కుటుంబ సభ్యుల ఫిర్యాదు, ఇతర ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment